న్యూఢిల్లీ, నవంబర్ 5 : కొనే వారు ఉండాలే కానీ తల వెంట్రుకను కూడా వేలల్లో అమ్మే సంస్థలకు ఈ ప్రపంచంలో లోటు లేదు. కొబ్బరి చిప్పను వేలల్లో అమ్మినా, లో దుస్తులకి లక్షల ధర పలికినా అదంతా ఆన్లైన్ మార్కెటింగ్ మాయాజాలం. ఇప్పుడు అదే తరహా జాబితాలో మనం నిత్యం వాడే సెఫ్టీ పిన్ (పిన్నీసు) కూడా చేరింది. సాధారణంగా మనం 10 రూపాయలో 20 రూపాయలో పెట్టి వీటి పాకెట్ని కొనుగోలు చేస్తాం. వీటిని వాడేటప్పుడు ఒకటి కన్పించకపోతే వెంటనే ఇంకోటి తీసి వాడతాం.
కానీ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ‘సేఫ్టీ-పిన్-బ్రూచ్’ పేరుతో ఒక సేఫ్టీ పిన్ను విడుదల చేసింది. అక్షరాలా దీని ధర 68,758 రూపాయలు. ఒక సాధారణ వస్తువును అధిక ధరతో లగ్జరీ ఫార్మాట్‌తో విడుదల చేయడంతో సామాజిక మాధ్యమంలో విపరీత స్పందనలు వచ్చాయి. ఇది లేత నీలం, గులాబీ, నారింజ రంగులలో లభిస్తుంది. దీనికి ఒక్కసారే కొనలేని వారికి ఈఎంఐ సౌకర్యం కూడా అందజేస్తున్నది.