Prada | ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada) చిక్కుల్లో పడింది. ఇటీవలే ఆ సంస్థ ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. స్ప్రింగ్ సమ్మర్ 2026లో భాగంగా ప్రాడా పురుషులకు చెందిన పాదరక్షలను ప్రదర్శించింది. ఇవి అచ్చం భారత్‌లోని కొల్హాపురిలో తయారైన చెప్పులు (Kolhapuri chappals) లాగానే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు ప్రముఖులు సైతం ప్రాడాపై మండిపడ్డారు. గ్లోబల్ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంక (Harsh Goenka) సైతం మండిపడ్డారు. దీంతో చివరికి ప్రాడా తన తప్పును అంగీకరించినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు.
ఈ వివాదం నేపథ్యంలో ప్రాడాపై న్యాయవాది గణేష్ హింగ్మైర్ కోర్టుకెక్కారు. కొల్హాపురి చేతివృత్తుల వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court)లో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ‘కొల్హాపురి చెప్పులు మహారాష్ట్ర సాంస్క్రృతిక చిహ్నం. వాటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వాటిని ప్రాడా కాపీ కొట్టింది. మన సంస్క్రృతిని సొమ్ము చేసుకుంటోంది. దీనిపై వ్యతిరేకత వ్యక్తమవగా.. బ్రాండ్ తన తప్పును అంగీకరించింది. అయితే, అధికారికంగా ఎలాంటి క్షమాపణలూ చెప్పలేదు. నష్టపరిహారం కూడా ప్రకటించలేదు.
తాము ప్రదర్శించిన చెప్పులు భారతీయ కళాకారుల నుంచి ప్రేరణ పొందినవని మాత్రమే ప్రకటించింది. విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే ఆ ప్రకటన చేసింది తప్ప.. కళాకారులు, భారత ప్రజలు, ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పలేదు’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు భారతీయ ఉత్పత్తులను కాపీ కొట్టకుండా, అనుకరించకుండా నిరోధించాలని కోరారు. చెప్పులే కాకుండా ఇతర భారతీయ సంప్రదాయ డిజైన్లను కాపీ కొట్టినందుకు ప్రాడాపై విమర్శలు చేశారు. కొల్హాపురి చేతివృత్తుల వారికి తగిన పరిహారం చెల్లించేలా ప్రాడాపై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో కోరారు.
ప్రాడా స్ప్రింగ్ సమ్మర్ 2026లో భాగంగా ప్రాడా పురుషులకు చెందిన పాదరక్షలను ఇటీవలే ప్రదర్శించింది. ఇవి అచ్చం భారత్‌లోని కొల్హాపురిలో తయారైన చెప్పులు (Kolhapuri chappals) లాగానే ఉన్నాయి. అయితే, వాటి ధర మాత్రం చర్చకు దారితీస్తోంది. సేమ్ డిజైన్‌తో అలాంటి చెప్పులు మన వద్ద రూ.400 వరకు ఉంటాయి. కానీ ప్రాడా మాత్రం ఆ చెప్పుల ధరను ఏకంగా రూ.1.2లక్షలుగా పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏంటీ.. ఈ చెప్పులు అంత ఖరీదా అంటూ చర్చించుకుంటున్నారు. ప్రాడాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలోని కొల్హాపురి చేతివృత్తులకు ప్రసిద్ధి. అక్కడ తోలుతో తయారు చేసే చెప్పులు 12వ శతాబ్దానికి చెందినవి. 2019లో ఇవి భౌగోళికంగా గుర్తింపు పొందాయి.
Also Read..
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. రూ.400 కోట్ల మేర నష్టం
PM Modi | మోదీ రాసిన కవితను వినిపించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని
Lalit Modi: పార్టీలో పాట పాడి.. ఎంజాయ్ చేసిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. వీడియో