Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. దీపావళి తర్వాత జాతీయ రాజధాని కాలుష్యం తారాస్థాయికి చేరింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగమంచు పేరుకుపోతున్నది. దీంతో ప్రజలు శ్వాస తీసుకొనేందుకు ఇబ్బందులుపడుతున్నారు. చలికాలంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వంతో పాటు వివిధ ఏజెన్సీలు విఫలమవుతున్నాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం ఉదయం తీవ్రమైన కేటగిరిలోనే నమోదైంది.
జహంగీర్పురాలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఏక్యూఐ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. అలాగే ఆనంద్ విహార్లో 453, నరేలాలో 482, పంజాబీ బాగ్లో 481, ఆర్కేపురంలో 430 నమోదైనట్లు తెలిపింది. రోజురోజుకు గాలి నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అయితే, శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ప్రకారం.. బుధవారం ఉత్తర దిశ నుంచి గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి వేగం తగ్గడంతో కాలుష్యం పెరిగింది. గురువారం తూర్పు దిశ నుంచి గాలులు వచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఉదయం సమయంలో భారీగా పొగమంచు పేరుకుపోతుందని అంచనా వేసింది. శుక్రవారం ఉత్తర, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తాయని, గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.