Pollution | ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాతావరణం మరోసారి దారుణంగా మారింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణం అమలులోకి తీసుకువచ్చింది. వాయు కాలుష్యం మరింత పెరగకుండా ఉండేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్ స్టేజీ థర్డ్లో స్టోన్ క్రషర్స్ మూసివేయడం, మైనింగ్ సంబంధిత కార్యకలాపాలు, నిర్మాణాలు, కూల్చివేతలపై కఠినమైన పరిమితులున్నాయి.
ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిలాల్లో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 స్టేజ్ వాహనాలపై ఆంక్షలుంటాయి. ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు ఐదో తరగతి వరకు పిల్లలకు పాఠశాలల్లో తరగతులను నిలిపివేసి.. ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించే అవకాశం ఉన్నది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి దారుణంగా ఉన్నది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ‘తీవ్’ కేటగిరికి చేరింది. ఆనంద్ విహార్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. ఇక్కడ ఏక్యూఐ 478కి చేరింది. నెహ్రూ స్టేడియం, ఐజీఐ విమానాశ్రయం, ఐటీఓ, 465-455 మధ్య కొనసాగుతున్నది.