Pollution | ఢిల్లీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ ఫోర్ వీలర్స్‌ను నిషేధించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP-III) స్టేజ్-3లో భాగంగా ఆంక్షలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4ని అమలులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మార్గదర్శకాలు పాటించని వారిపై మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194(1) ప్రకారం రూ.20వేల భారీ జరిమానా విధించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివిధ వర్గాల వాహనాలపై ప్రభావం చూపనున్నది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ తేలికపాటి మోటారు వాహనాలు ఇకపై ఢిల్లీలో నడిపేందుకు అనుమతి ఉండదు. బీఎస్-3, అంతకంటే తక్కువ ప్రమాణాలతో నడిచే డీజిల్ గూడ్స్, అత్యవసర వస్తువనులను రవాణా చేసే వాహనాలను మినహాయించారు.
ఢిల్లీ వెలుపలి నుంచి నడిచే తేలికపాటి వాణిజ్య వాహనాలు సైతం నిత్యావసర వస్తువులను తీసుకువెళితే తప్పా నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉన్న బస్సులు మినహా బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెందిన బస్సులు రాకుండా చర్యలు చేపట్టారు. యాక్షన్ ప్లాన్-4లో ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం, అవసరమైన వస్తువులను తీసుకువెళ్లే వాహనాలకు సంబంధించి మినహాయింపులు అమలులో ఉన్నాయి. ఎల్ఎన్జీ, సీఎన్జీ, బీఎస్-4 డీజిల్, ఈవీ వంటి సహజ ఇంధనాలతో నడిచే వాణిజ్య వాహనాలకు పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే కూల్చివేతలు, మట్టి, నిర్మాణ పనులు తదితర కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్లకు సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు 2.7లక్షలుపైగా చలాన్లు జారీ అయ్యాయి. గత మూడేళ్లలు ఇంత పెద్ద ఎత్తున జరిమానాలు విధించడం ఇదే అత్యధికం.