
లక్నో : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయరాదని, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కోరాయి. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఇతర సీనియర్ అధికారులు జరిపిన సంప్రదింపుల్లో యూపీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
క్షేత్రస్ధాయి పరిస్ధితులను పర్యవేక్షించేందుకు ఈసీ బృందం లక్నోలో పర్యటిస్తోంది. కొవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రతినిధి బృందాలు ఈ సందర్భంగా ఈసీని కోరాయి. కొవిడ్-19 కేసులు పెరగకుండా కఠిన నియంత్రణలు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని ఈసీని తాము కోరామని భేటీ అనంతరం ఎస్పీ యూపీ చీఫ్ నరేష్ ఉత్తమ్ పటేల్ వెల్లడించారు.
పోల్ షెడ్యూల్‌ను ప్రకటించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న సందేహాలను తొలగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రాధోడ్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్ తలెత్తవచ్చనే ఆందోళనల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు అదనపు ముఖ్యకార్యదర్శి (హోం)ని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది.