Loksabha Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆయా ఆయా రాష్ర్టాల్లో సీఎంలుగా సీనియర్లను కాదని కొత్త ముఖాలను తెర ముందుకు తెచ్చిన బీజేపీ.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. వరుసగా మూడోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతున్నది. ఇందుకోసం 2019 ఎన్నికల సమయంలో అనుసరించిన ‘సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో అభ్యర్థుల మార్పు’ ఫార్ములానే ఈసారి కూడా ఫాలో అవ్వాలనే యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 99 మంది సిట్టింగుల స్థానంలో కొత్త వారికి టికెట్ ఇచ్చిన కమలం పార్టీ, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దాదాపు 100 స్థానాల్లో సిట్టింగ్లను మార్చనున్నట్టు తెలుస్తున్నది.
వివిధ రాష్ర్టాలలో బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్(ఏబీఎం) అనే ఏజెన్సీ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. ప్రాథమిక సర్వేలో దాదాపు 100 సిట్టింగ్ ఎంపీలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని, తిరిగి వారికే టికెట్లిస్తే ఆ సీట్లపై ఆశలు వదులుకోవాలని అధిష్ఠానానికి నివేదిక సమర్పించిందని సమాచారం. ఈసారి టికెట్ గల్లంతయ్యే వారి లిస్టులో వరుణ్ గాంధీ, మేనకా గాంధీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. 75 ఏండ్ల పైనున్న ఐదుగురు నేతలు, పదవీ విరమణ వయసు దాటిన మరో పది మందిని ఈసారి పక్కన పెట్టాలని బీజేపీ అధిష్ఠానం అలోచిస్తున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో మథుర ఎంపీ హేమమాలిని ఉన్నారు. అదేవిధంగా గుజరాత్లో 8 మంది, బీహార్, మహారాష్ట్రల్లో 10 మంది, మధ్యప్రదేశ్లో 11 మందికి టికెట్లు కట్ చేయాలన్న ఆలోచన బీజేపీ అధిష్ఠానానికి ఉందట.
2019లో కూడా బీజేపీ అధిష్ఠానం చాలా మంది వృద్ధులైన సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదని, అందులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మాజీ సీఎం బీసీ ఖండూరీ, మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.