Rahul Gandhi | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తూ ఓ లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉన్నది. ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సదరు యువకుడు కేవలం బెదిరించేందుకే లేఖను రాసినట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి. లేఖలో రాహుల్ గాంధీతో పాటు కమల్‌నాథ్‌ను కాల్చివేస్తామని బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది.
ఈ నెల 20న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాల్సి ఉండగా.. గుజరాత్ పర్యటన కారణంగా కార్యక్రమం రెండు రోజులు వాయిదా పడింది. మధ్యప్రదేశ్‌లో యాత్ర ఈ నెల 23న ప్రారంభం కానుండగా.. లేఖ తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌కు వస్తే పర్యటన సందర్భంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడుతామని, దీంతో పాటు సిక్కు అల్లర్లకు కారణమైన కమల్‌నాథ్‌ను కాల్చి చంపుతామని లేఖలో బెదిరించారు. లేఖ రాసిన అనుమానిత యువకుడు అన్నపూర్ణ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. సదరు యువకుడు ఓ స్వీట్ షాపునకు పోస్ట్ ద్వారా బెదిరింపు లేఖను పంపగా.. లేఖను చదివిన దుకాణదారు పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని.. లేఖలో చేతిరాతను సరిపోల్చుతున్నారు.