హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్లో ఇవాళ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకే చెందుతోందని తెలిపారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని విమర్శించారు. పాక్ వద్ద బాంబులు ఉన్నాయని, కాబట్టి పీవోకే గురించి మాట్లాడవద్దు అని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పేర్కొన్న విషయాన్ని మంత్రి తెలిపారు. అణు బాంబు ఉందన్న భయంతో.. పీవోకేను వదులుకోవాలన్న ఆలోచన సరికాదు అని మంత్రి పేర్కొన్నారు. మీరు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, మోదీజీ మళ్లీ ప్రధాని అవుతారని, పాక్ బుల్లెట్లకు భారీ తుపాకులతో బదులిస్తామని మంత్రి వెల్లడించారు. సర్జికల్ దాడులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. సర్జికల్ దాడుల్ని మోదీ ఆదేశాలతో నిర్వహించామని, ఉగ్రవాదుల్ని తుడిచి పెట్టామని పేర్కొన్నారు.