న్యూఢిల్లీ, జూలై 7: హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. సత్సంగ్‌లో కొందరు క్యాన్లలో విష వాయువు తెచ్చి వదిలారని ఆరోపించారు. భోలే బాబాకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కొందరు ఈ కుట్ర చేశారని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సత్సంగ్‌కు హాజరైన జనం మధ్యలో 15-16 మంది క్యాన్లలో తెచ్చిన విష పదార్థాన్ని వదిలారని తన వద్దకు వచ్చిన ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలిపారు. తాను మృతుల పోస్ట్‌మార్టం రిపోర్టులను కూడా చూశానని.. వారు గాయాలతో కాకుండా ఊపిరి అందకపోవడం వల్ల మరణించినట్టు వాటిలో ఉందని చెప్పారు.
ఈ కుట్ర చేసిన వారు పారిపోయేందుకు వీలుగా వాహనాలను కూడా అప్పటికే సిద్ధం చేసి ఉంచారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న సాక్షాన్ని అందిస్తామని తెలిపారు. ఈ విషయాలను చెప్పిన ప్రత్యక్ష సాక్షులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన జ్యుడీషయల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. శనివారం ఘటనాస్థలి వద్దకు వెళ్లి స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను కమిషన్ సభ్యులు విచారించారు. ఈ ఘటనపై అవసరమైతే భోలే బాబాను సైతం విచారిస్తామని సభ్యులు తెలిపారు.