బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం, 2012 బాలబాలికలకు సమానంగా వర్తిస్తుందని, లైంగిక దాడికి స్త్రీ, పురుషులను జవాబుదారీ చేస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. 13 ఏళ్ల మైనర్ బాలునిపై 48 ఏళ్ల మహిళా ఆర్ట్ టీచర్ పదే పదే లైంగిక వేధింపులకి పాల్పడినట్లు నమోదైన కేసులో హైకోర్టు ఈ వివరణ ఇచ్చింది.
తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆమె హైకోర్టును కోరారు. జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ పిటిషన్ను తిరస్కరించారు. స్త్రీ, పురుషుల మధ్య భేదాన్ని ఈ చట్టం చూపించడం లేదని తెలిపారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి స్త్రీయా లేదా పురుషుడా అనే విషయంతో సంబంధం లేదన్నారు. జరిగిన చర్య, మైనర్ బాలుడు/బాలిక బాధితులవడం మాత్రమే ముఖ్యమైన విషయాలని వివరించారు. పోక్సో చట్టం లింగ తటస్థ స్వభావం కలదని ఈ చట్టానికి 2019లో జరిగిన సవరణలు స్పష్టం చేసినట్లు హైకోర్టు తెలిపింది.