న్యూఢిల్లీ, నవంబర్ 6: ప్రతిభగల విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించే పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. నాణ్యత గల ఉన్నత విద్యను కొనసాగించడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకి కారాదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎవరికైనా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం లభిస్తే వారి కోర్సుకు అవసరమైన ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు అవసరమైన పూర్తి విద్యా రుణాన్ని ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందవచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌ల ద్వారా నిర్ణయించిన నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలు (క్యూహెచ్ఈఐ)కు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలతో పాటు, నిర్దిష్ట ర్యాంకింగ్స్ పొందిన విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందే విద్యార్థులు ఈ విద్యా రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం పరిధిలోకి 860 ఉన్నత విద్యాసంస్థలు వస్తాయని, ప్రతి ఏడాది 22 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.
ఓసీఐ మిత్రులకు లక్ష ఈ-వీసాలు
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు భారత్ ‘చలో ఇండియా క్యాంపెయిన్’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగే వరల్డ్ ట్రావెల్ మార్ట్ సందర్భంగా లండన్‌లో ప్రారంభిస్తారు. విదేశాల్లోని భారతీయుల స్నేహితుల కోసం ఉచిత వీసాలను జారీ చేస్తారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్హోల్డర్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఒక ఓసీఐ కార్డ్‌హోల్డర్ ఐదుగురు విదేశీయులను ప్రత్యేక పోర్టల్ ద్వారా నామినేట్ చేయవచ్చు. ఆ ఐదుగురికి ఎటువంటి రుసుమును వసూలు చేయకుండా ఉచితంగా గ్రాటిస్ ఈ-వీసాలను ప్రభుత్వం జారీ చేస్తుంది. మొత్తంగా లక్ష ఉచిత ఈ-వీసాలను జారీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.