Vantara – Narendra Modi | 2000 జాతులకు పైగా, 1.5 లక్షలకు పైగా అంతరించిపోతున్న జంతువులకు కేంద్రం వంతారా.. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో 3,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కేంద్రం. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ కాంప్లెక్స్ వద్ద కొలువు దీరిన ఈ వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రంలో వాటి కోసం అన్ని రకాల వసతులు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు లోపల కలియతిరిగారు. ఈ వన్యప్రాణి కేంద్రంలో కల్పించిన వైద్య వసతులన్నీ పరిశీలించారు. పలు జాతుల జంతువులతో మమేకం అయ్యారు. దొంగిలించబడిన వన్యప్రాణులకు అభయారణ్యంగా పునరావాసం కల్పించడంతోపాటు వైద్య వసతులు కూడా కల్పించారు.
వంతారాలోని వన్య ప్రాణుల దవాఖానను ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. వన్య ప్రాణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన దవాఖానలో వైల్డ్ లైఫ్ అనస్థీసియా, కార్డియాలజీ, నేప్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసన్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ తదితర జంతు వైద్య వసతులను పరిశీలించారు. ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్లో ఆసియా సింహానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్న తీరును ఆసక్తిగా గమనించారు.జాతీయ రహదారిపై గాయపడిన ఓ చిరుత పులిని సంరక్షించి వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. గాయపడిన చిరుతపులికి ఆపరేషన్ థియేటర్లో చేస్తున్న శస్త్ర చికిత్సను పరిశీలించారు.
ఆసియా ఖండ ప్రాంత సింహాలు, చిరుత పిల్లలు, అరుదైన జాతుల పిల్లలతో ప్రధాని మోదీ కొద్దిసేపు సరదాగా ఆడుకున్నారు. ఇటీవలే సంరక్షించి వంతారా వన్యప్రాణి కేంద్రానికి తరలించిన ఆడ సింహం జన్మనిచ్చిన సింహం పిల్లలు, పొడవైన కాళ్ల అడవి పిల్లులతో ఆయన ఆడుకున్నారు.ఒకప్పుడు భారతీయ అడవుల్లో సమృద్ధిగా కనిపించే పొడవు కాళ్ల అడవి పిల్లి ప్రస్తుతం అరుదైన జాతిగా మారింది. వంతారా వన్య ప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రంలో పొడవైన అడవి పిల్లుల సంతానోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టారు. అవి పుట్టి పెరిగిన తర్వాత దేశంలోని ఇతర వన్య ప్రాణులు, అభయారణ్యాల్లో విడుదల చేస్తున్నారు.
ఆసియా సింహాలు, మంచు చిరుతపులులు, ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల వంటి పలు క్రూర మృగాలతో ప్రధాని నరేంద్రమోదీ అతి సన్నిహితంగా తిరుగాడారు. గోల్డెన్ టైగర్, నాలుగు మంచు పులులు, చింపాంజీలు, జీబ్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగం దూడల మధ్య నుంచి అడుగులేస్తూ నీటి కొలనుల్లో గల మొసళ్లు, నీటి గుర్రాలకు అత్యంత సన్నిహితంగా మెదిలారు. సమీప గ్రామాల ప్రజలు సంరక్షించి వంతారా క్షేత్రానికి తరలించిన పెద్ద కొండ చిలువ, రెండు తలల పాము, రెండు తలల తాబేలు తదితర జంతువులనూ ప్రధాని మోదీ తిలకించారు.
కీళ్ల వాపులు, కాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఏనుగుల నడకలో మెరుగుదలకు హైడ్రో థెరపీ పూల్స్ కూడా వంతారా కేంద్రంలో నిర్మించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన ఏనుగుల దవాఖానలో జరుగుతున్న చికిత్స, తదితర విషయాలను ప్రధాని మోదీ గమనించారు. ఈ కేంద్రంలో సంరక్షిస్తున్న చిలుకలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సపోర్టింగ్ స్టాఫ్, సిబ్బందితో ప్రధాని మోదీ ఇష్టాగోష్టిగా సంభాషించారు.