Amit Shah in Kashmir | ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక శ్రద్ధ వల్లే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణాన్ని రద్దు చేయగలిగామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. కశ్మీర్ లోయలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. రాజధాని శ్రీనగర్ అభివృద్ధికి వాగ్దానాల వర్షం కురిపించారు.
రెండేండ్లలో శ్రీనగర్‌కు మెట్రో రైలు సర్వీసు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కశ్మీర్‌లోయలో రెండో రోజు ఆదివారం పర్యటనలో భాగంగా అమిత్‌షా.. భగవతీ నగర్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. జమ్ము విమానాశ్రయ విస్తరణతోపాటు ప్రతి జిల్లా కేంద్రానికి హెలికాప్టర్ సేవలు కల్పిస్తామని ప్రకటించారు.
కశ్మీర్‌లోయలో మొదలైన అభివృద్ధిని ఎవరూ నిలువరించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. స్థానిక యువకులు జమ్ముకశ్మీర్ ప్రగతికి సహకరిస్తే ఉగ్రవాదాన్ని కట్టడి చేయొచ్చునన్నారు. అభివృద్ధి పనులకు విఘాతం కలిగించే శక్తుల ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.