PM Modi : బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (Mukhyamantri Mahila Rojgar Yojana)’ కార్యక్రమాన్ని ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar), ఆ రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీహార్ మహిళలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
దేవీ నవరాత్రుల వేళ బీహారీ మహిళల ఆశీస్సులు తమకు కావాలని, అవి తమకు ఎంతో బలాన్నిస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. వారికి హృదయపూర్వ అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనతో మహిళలకు ఆర్థిక భరోసానిస్తుందని చెప్పారు. మొత్తం 75 లక్షల మంది మహిళలు పథకంలో చేరారని, వారందరికీ రూ.10 వేల చొప్పున ఖాతాల్లో పడనున్నాయని తెలిపారు.
‘ఈ పవిత్ర దేవీ నవరాత్రోత్సవాల వేళ మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. మీ అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ్టి నుంచి ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో 75 లక్షల మంది సోదరీమణులు చేరారు. వారందరి ఖాతాల్లో ఇవాళ రూ.10 వేల నగదు జమ కానుంది’ అని ప్రధాని చెప్పారు.
ఢిల్లీ సర్కారు నుంచి రూపాయి కేటాయిస్తే అది రాష్ట్ర ప్రజలకు చేరేసరికి 15 పైసలు అవుతున్నదని గతంలో అప్పటి ప్రధాని చెప్పారని, ఇప్పుడు అలాంటి లూటీకి ఆస్కారం లేదని, కేంద్రం ఇచ్చే డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుందని ప్రధాని తెలిపారు. ఆర్జేడీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, ముఖ్యంగా మహిళలు వెనక్కి నెట్టివేయబడ్డారని ఆయన గుర్తుచేశారు. ఆర్జేడీ ఆటవిక పాలన సాగించిందని ఆరోపించారు.
‘తన సోదరీమణులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటంతోపాటు వారి కుటుంబాలు ఆర్థికంగా బలంగా ఉంటే వారి సోదరుడు సంతోషంగా ఉంటాడు. అందుకోసం అతడు ఏం చేయాలో అది చేస్తాడు. ఇవాళ మీ సోదరులు నరేంద్రమోదీ, నితీశ్‌కుమార్ కూడా మీకు సేవచేయడం కోసం, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ద్వారా ప్రతి ఇంటి నుంచి కచ్చితంగా ఒక మహిళకు లబ్ధి చేకూరుతుంది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.