PM Modi : ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ సెటైర్లు వేశారు. ఆదివారం బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాక్‌పూర్‌లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతల చేతిలో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలను టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. టీఎంసీ బాధితులను వేధిస్తూ షాజహాన్ షేక్ లాంటి నేరస్థులకు రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. టీఎంసీ ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోవడంతో బెంగాల్లో హిందువులు రాముడి పేరు పలుకడానికి, శ్రీరామనవమి జరుపుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ‘సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA)’ను రద్దు చేయడం ఎవరివల్లా కాదని ప్రధాని మోదీ అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపైనా మోదీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించకుండానే ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ యువరాజు వయస్సుకు మించికి ఓట్లు రావని ఎద్దేవా చేశారు. అంటే ప్రస్తుతం రాహుల్‌గాంధీ వయస్సు 53 సంవత్సరాలు కాబట్టి కాంగ్రెస్‌కు 53 కంటే ఎక్కువ సీట్లు రావని అన్నారు.