NEET UG 2026 : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 45 నిమిషాలపాటు ఆగిపోయారు. దీనికి కారణం నీట్ యూజీ పరీక్ష. ఆదివారం ఉదయం ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడినుంచి తిరిగి మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేసరికి మధ్యాహ్నం 1.15 గంటలైంది. ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. ప్రధాని కాబట్టి, ఎయిర్పోర్ట్ నుంచి త్వరగా బయటకు వచ్చి, తన అధికారిక నివాసానికి వెళ్లొచ్చు. ఇందుకోసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తారు. ఆయన ప్రయాణానికి ఎటువంటి ఆంక్షలు ఉండవు.
అయినప్పటికీ మోదీ అక్కడే ఉండిపోయారు. అది కూడా 45 నిమిషాలు. 1.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు మోదీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు. 2.00 గంటల తర్వాతే అక్కడి నుంచి బయల్దేరి తన అధికారిక నివాసానికి వెళ్లారు. ప్రధాని అలా 45 నిమిషాలపాటు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోవడానికి కారణం నీట్ పరీక్ష. ఆదివారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కూడా చాలా సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతోంది. అసలే ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. పైగా ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ నుంచి 1.15 గంటలకు బయటకు వస్తే.. తనకోసం ట్రాఫిక్ ఆపడం, సెక్యూరిటీ వంటి వాటి వల్ల ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు.
అందులో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కూడా ఉండొచ్చు. తను వెళ్లడం వల్ల నీట్ అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. పరీక్ష ప్రారంభమైన 2.00 గంటల తర్వాత మోదీ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని మోదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామంగా పలువురు చెబుతున్నారు. ఇక, నీట్ పరీక్ష కొద్దిసేపటి క్రితమే ముగిసింది.