హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ మోసాల పరంపర కొనసాగిస్తున్నది. ఉద్యోగాలివ్వండి.. నోటిఫికేషన్లు జారీచేయండి మహాప్రభో అంటూ నిరుద్యోగులు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కనీసం 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీచేయాలని కోరుతుంటే.. నిరుద్యోగుల ఆశలకు గండికొడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం 7,437 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీఐ లెకల ప్రకారం పోలీస్‌శాఖలో 20 వేల పైచిలుకు ఖాళీలు ఉన్నాయి. గతంలో సీఎం సైతం పోస్టులన్నీ భర్తీ చేస్తామని బహిరంగసభ వేదికగా హామీ ఇచ్చారు. ఆచరణకు వచ్చేసరికి 7,437 పోస్టులకే పరిమితం చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లుగా నోటిఫికేషన్లు రాకపోవడంతో వేలాదిమంది వయోపరిమితి దాటిపోయింది. నోటిఫికేషన్లో ఎలాంటి వెసులుబాటు కల్పించకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
నిరుద్యోగ జేఏసీ యాత్ర పేరుతో కాంగ్రెస్ నిరుద్యోగులను వాడుకున్నది. జాబ్ క్యాలెండర్, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలంటూ హామీలు గుప్పించింది. తాము అధికారంలో వచ్చేందుకు ఎవరైతే దోహదపడ్డారో ఇప్పుడు వారినే విస్మరించింది. ‘గెలిచిన తెల్లారే అశోక్‌నగర్‌కు వస్తా.. మీ సమస్యలు పరిష్కరిస్తా’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లు దాటినా తమను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా అరకొర పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల ఆకాంక్షలు గాలికొదిలేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. డీజీపీ స్థాయి అధికారే రాష్ట్రంలో 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ, ప్రభుత్వం 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

తక్షణమే ఈ నామమాత్రపు నోటిఫికేషన్ నిలిపివేయాలని అన్నారు. అదనంగా మరో 13 వేల పోస్టులు కలిపి ఆగస్టు 15లోపు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీస్ అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన పంతాన్ని వీడకపోతే, నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం తన అనాలోచిత విధానాలను మార్చుకోకపోతే, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పెద్దఎత్తున ఉద్యస్తుందని హెచ్చరించారు.

అన్ని ఖాళీలను కలుపుకొని 20,000 పోస్టులను భర్తీ చేయాలని, కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 36 ఏండ్లకు, ఎస్సై అభ్యర్థులకు 37 ఏండ్లకు పెంచాలని, నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.