వారణాసి : ప్రధాని మోదీ లోక్సభ నియోజకవర్గం వారణాసిలో ఇటీవల 19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ టూర్లో ఉన్న మోదీ.. శుక్రవారం ఉదయం వారణాసిలో ల్యాండ్ కాగానే అధికారులను కలిశారు. అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి సంపూర్ణ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నిందితులపై చట్టం ప్రకారం కఠినమైన శిక్ష అమలు చేయాలని అధికారుల్ని ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీనిపై యూపీ సర్కారు ఓ ప్రకటన జారీ చేసింది.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారణిసి వెళ్లిన మోదీ .. అక్కడకు చేరుకోగానే పోలీసు కమీషనర్, డివిజనల్ కమీషనర్, జిల్లా మెజిస్ట్రేట్.. సిటీలో ఇటీవల జరిగిన క్రిమినల్ గ్యాంగ్ రేప్ గురించి వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రధాని మోదీ.. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.
వారణాసిలో ఓ 19 ఏళ్ల అమ్మాయిని ఇటీవల 23 మంది ఆరు రోజుల పాటు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మత్తు ఇచ్చి .. అనేక హోటళ్లు తిప్పినట్లు విచారణలో తేలింది. సోమవారం నాటికి ఈ కేసుతో లింకున్న ఆరు మందిని అరెస్టు చేశారు.