PM Modi : బడ్జెట్ సమావేశాల (Budget session) నేపథ్యంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ (గురువారం) పార్లమెంట్ (Parliament) ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్ (EU) తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఒప్పందం శుభసూచకమని చెప్పారు. రీఫార్మ్-పెర్ఫామ్-ట్రాన్స్ఫామ్ అంటూ బడ్జెట్ టోన్‌లో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం భారతదేశం రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌లో ముందుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయం కాదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణమని, అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోందని అన్నారు. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలని చెప్పారు.
పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండటంతో భారత్‌ను సుస్థిరదేశంగా ప్రపంచం చూస్తోందని ప్రధాని అన్నారు. ట్రేడ్ డీల్‌తో కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాటి నుంచి తయారీదారులు లబ్ధి పొందాలని కోరుతున్నానని, ఈయూలోని 27 దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని పేర్కొన్నారు. మనం టెక్నాలజీతో పోటీపడతామని, దానిని అందిపుచ్చుకుంటామని, దాని సామర్థ్యాన్ని అంగీకరిస్తామని, అయితే అది మనుషులను భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు.