PM Narendra Modi- Kuwait Tour | కువైట్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 21వ తేదీ నుంచి రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్, ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబాహ్ తదితరులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా భారతీయ కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22న కువైట్ ఉన్నత అధికారులతో ఆయన అధికారికంగా చర్చించనున్నారు. కువైట్‌లో దాదాపు 10 లక్షలమంది భారతీయులు నివసిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ పర్యటించని ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్.
1981లో కువైట్‌ను సందర్శించిన చివరి భారత ప్రధాని ఇందిరా గాంధీ. 43 ఏండ్ల విరామం తర్వాత కువైట్‌లో ప్రధాని స్థాయి పర్యటన జరుగుతోంది. భారతదేశం, కువైట్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. కువైట్ ఇంధన సహకారంలో ముఖ్యమైన భాగస్వామి మాత్రమే కాదు ఆ దేశ శ్రామికశక్తికి వెన్నెముకగా ఉండే పెద్ద భారతీయ ప్రవాస సమాజానికి కూడా ఆతిథ్యం ఇస్తున్నది.