న్యూఢిల్లీ, జూలై 21: ప్రధాని మోదీ పదే పదే ఊదరగొడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనానికి సంబంధించి రోజుకో ఉదాహరణ బయటపడుతున్నది. బీజేపీ చెబుతున్న అభివృద్ధిలో అసలు సరుకెంతో వానచినుకు తేల్చిపారేస్తున్నది. నిన్న గుజరాత్లోని రహదారులు కుంగిపోయిన దుస్థితిని చూస్తే.. ఈసారి యూపీలో రహదారుల నాణ్యత కండ్లకు కట్టింది. ప్రారంభించిన ఐదురోజులకే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే గుంతలమయంగా మారింది. జూలై 16న ప్రధాని మోదీ అట్టహాసంగా ఈ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. సరిగ్గా ఐదారు రోజులకే ఈ రోడ్డు నామరూపాల్లేకుండా పోయింది.
కురిసిన వర్షానికే చాలా చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. నాలుగు లైన్లతో 296 కిలోమీటర్ల పొడవుతో చిత్రకూట్ జిల్లా గోండా గ్రామం నుంచి ఇటావా జిల్లాలోని కుద్రాయిల్ గ్రామాన్ని కలుపుతుంది. పైగా ఈ ప్రాజెక్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలల ప్రాజెక్టు అని చెబుతున్నారు. స్వయంగా పర్యవేక్షించిన ఆయన కలల ప్రాజెక్టు కూడా ఇలా చిన్నపాటి వానలకే ఇలా కొట్టుకుపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. సలేంపూర్ దగ్గరల్లోని చిరియాలో ఈ రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో రెండు కార్లు ఢీకొన్నాయి. గుంతల వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్న ఈ రోడ్డును రూ.8 వేల కోట్లతో నిర్మించడం గమనార్హం.