PM Modi : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల దేశంలో చమురు కొరత తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తోంది. అలాగే, పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. భవిష్యత్తులో ఈ సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో చమురు సరఫరా, ఎరువులు, విద్యుత్ వంటి అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం కీలక భేటీ నిర్వహించనున్నారు.
మోదీ అధ్యక్షతన పెట్రోలియం, చమురు, ఎరువులు, విద్యుత్ శాఖ మంత్రులతోపాటు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దేశంలో ఇంధన కొరతను ఎదుర్కోవడం, సరఫరా పెంచడం, సరుకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడటం వంటి అంశాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. ఈ అంశంలో ప్రజలు, పరిశ్రమల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. ఇది దేశానికి కీలక పరీక్ష అని, ఈ పరిస్థితిని సహనం, శాంతి, అవగాహన వంటి వాటి ద్వారా ఎదుర్కోవాలని ఇటీవల మోదీ వ్యాఖ్యానించారు. చమురు సరఫరా నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల తర్వాత నుంచి దేశానికి చమురు సరఫరా నిలిచిపోయింది.
అప్పట్నుంచి దేశంలో ఇంధన కొరత వేధిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఇప్పటికే కొన్ని నౌకలు ఇండియా చేరుకున్నప్పటికీ, దేశీయ అవసరాలు తీరాలంటే ఇంకా పూర్తిస్థాయిలో చమురు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. హోర్ముజ్ జలసంధి నుంచి శతృదేశాలు మినహా అన్ని దేశాల నౌకల్ని అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. అయితే, నిజంగానే ఇరాన్ ఈ పని చేస్తే దేశంలో చమురు కొరత తీరుతుంది. లేదంటే ఇంకా కొనసాగుతుంది.