PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు బుధవారం ఫోన్ చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ లో వెల్లడించారు. ‘స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడాను. ఆయనకు, ఇజ్రాయెల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాను. ఇరుదేశాల సంబంధాలను ఈ ఏడాది మరింత బలోపేతం చేయడంపై చర్చించాం.
ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చించాం. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని కచ్చితమైన నిర్ణయంతో ఉన్నాం’ అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ అంశాల్లో సహకారం, ప్రగతిపై ఇరు దేశాల ప్రధానులు హర్షం వ్యక్తం చేశారు. రక్షణ, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, తీవ్రవాదాన్ని అణచివేయడం వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని తాజా పరిస్థితులపై చర్చించారు.
శాంతి, స్థిరత్వం కోసా పాటుపడాలని నిర్ణయించారు. గత నెలలోనే నెతన్యాహు.. మోదీకి ఫోన్ చేశారు. గాజాతో కాల్పులు విరమణ అంశంపై చర్చించారు. నెతన్యాహు గత నెలలోనే ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, వివిధ కారణాలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చించడం ఆసక్తికరంగా మారింది.