Modi Talks Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై సైనిక దాడికి తక్షణం స్వస్తి పలుకాలని కోరారు. ఉక్రెయిన్‌పై హింసకు తెర దించాలని అభ్యర్థించారు. తొలి నుంచి భారత్‌కు రష్యా మిత్రదేశంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తక్షణం యుద్ధాన్ని నిలిపేయాలని పుతిన్‌ను ప్రధాని నరేంద్రమోదీ కోరడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఉక్రెయిన్‌లోని రెండు తూర్పు ప్రాంతాలు ప్రకటించుకున్న స్వాతంత్య్రాన్ని గుర్తిస్తున్నట్లు తొలుత ప్రకటించిన పుతిన్.. గురువారం ఉదయం సైనిక దాడి చేపట్టారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు పలు నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది రష్యా సైన్యం. 70కి పైగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ తమలో కలిసి పోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. బ్రిటన్, జర్మనీ దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాల కూటమి నాటో కూడా రష్యా చర్యను తప్పుబట్టింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు, సహజ వాయువు, బంగారం ధరలు పైపైకి దూసుకెళ్లాయి.