PM Modi : తానుండగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జమ్ముకశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. ఈ క్రమంలో ఇటీవల అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కార్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కూటమి గెలిచింది. అంతేగాక ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి జమ్ముకశ్మీర్ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో ఆ పార్టీ తీరును మహారాష్ట్రలో బీజేపీ నాయకులు ఎండగడుతున్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తాను ఉన్నంత వరకు కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే పరిపాలిస్తుందని చెప్పారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరని, జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ ఉద్దేశాలను మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రయత్నాలను దేశం అంగీకరించదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.