PM Modi | తమిళనాడులో రూ.8300కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పవిత్రమైన రామనవమి పండుగని.. కొద్ది నిమిషాల ముందు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయన్నారు. ఆయన రాజ్యం నుంచి లభించిన సుపరిపాలన స్ఫూర్తి.. దేశ నిర్మాణానికి పెద్ద ఆధారమన్నారు. గత పదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు అయ్యిందని.. ఇంత వేగవంతమైన వృద్ధికి ఒక పెద్ద కారణం మన అద్భుతమైన ఆధునిక మౌలిక సదుపాయాలేనన్నారు. గత పదేళ్లలో రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, నీరు, ఓడరేవులు, విద్యుత్, గ్యాస్ పైప్లైన్లు మొదలైన మౌలిక సదుపాయాల బడ్జెట్ను సుమారు ఆరు రెట్లు పెంచామన్నారు. నేడు దేశంలో భారీ ప్రాజెక్టుల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మోదీ తెలిపారు. ఉత్తరాన చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనల్లో ఒకటైన ‘చీనాబ్ వంతెన’ జమ్మూ కశ్మీర్లో నిర్మించామన్నారు. పశ్చిమంలో ముంబయిలో దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ నిర్మించినట్లు పేర్కొన్నారు.
తూర్పు వైపున అసోంలోని ‘బోగీబీల్ వంతెన’ కనిపిస్తుందన్నారు. దక్షిణాదికి వస్తే ప్రపంచంలోని కొన్ని నిలువు లిఫ్ట్ బ్రిడ్జిలలో ఒకటైన ‘పంబన్ వంతెన’ నిర్మాణం పూర్తయ్యిందన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో తమిళనాడుది పెద్ద పాత్ర అని.. తమిళనాడు బలం ఎంత స్ట్రెంత్ ఎంత పెరుగుతుందో.. భారత్ అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానన్నారు. గత దశాబ్ద కాలంలో 2014 కంటే మూడు రెట్లు అధికంగా తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అయినప్పటికీ కారణం లేకుండా ఏడవడం కొందరికి అలవాటని.. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవన్నారు. ఈ సంవత్సరం తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6వేలకోట్లకుపైగా కేటాయించారని.. భారత ప్రభుత్వం ఇక్కడ 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో రామేశ్వరం రైల్వేస్టేషన్ సైతం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. రామేశ్వరానికి వెళ్లే పంబన్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సందర్భంగా రామేశ్వరం ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.