న్యూఢిల్లీ : వరుసలో నిల్చునే చిట్టచివరి వ్యక్తికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ట్రైనీ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. ఫైల్స్, ఫీల్డ్ మధ్య ఉన్న తేడాను పసిగట్టి మీరు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు.
ప్రజలతో మమేకం అయ్యేందుకు క్షేత్రస్ధాయిలో పనిచేయాలని సూచించారు. నూతన ప్రపంచ పోకడలకు అనుగుణంగా మనం కీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో మీరు జిల్లాల్లో వివిధ శాఖల బాధ్యతలను చేపడతారని, అందుకే మీరంతా ఆత్మనిర్భర్ భారత్, ఆధునిక భారత్‌ను నిత్యం మీ మనసులో నిక్షిప్తం చేసుకుని తదనుగుణంగా కార్యక్షేత్రంలో పనిచేయాలని పిలుపు ఇచ్చారు.
మనం సంస్కరణలను ముందుకు తీసుకుపోతూ వ్యవస్ధను మేలిమలుపు తిప్పాలని కోరారు. ప్రతిఒక్కరి భాగస్వామ్యంతోనే నవ భారత్ సాకారమవుతుందన్న విషయం మీరు గుర్తెరగాలని అన్నారు. ప్రధాని మోదీ ముస్సోరిలోని ప్రాంగణంలో న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించి పునరుద్ధరించిన హ్యాపీ వ్యాలీ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు.