లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది విడత పోరు కీలక దశకు చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మెగా రోడ్‌షోలు, భారీ ర్యాలీలతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ అంశాన్నీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం ముంగిట పలు సవాళ్లు ఎదురైన సందర్భంలో విపక్షాలు వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన భద్రతా దళాలు, ప్రజలు సంక్షోభాన్ని అధిగమించేందుకు పోరాడుతుంటే వాటిని మరింత సంక్లిష్టం చేసేందుకు వారు (ప్రతిపక్షాలు) అన్ని ప్రయత్నాలు చేస్తారని మండిపడ్డారు.
కరోనా మహమ్మారి విషయంలో ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభంలోనూ విపక్షాల తీరును మనం చూశామని ప్రధాని పేర్కొన్నారు. ఇక యూపీలో నిరుద్యోగ సమస్య తీవ్రతను కేవలం సమాజ్‌వాదీ పార్టీయే లేవనెత్తుతోందని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ నిరంతరం పేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి కట్టుబడిఉందని స్పష్టం చేశారు. ములాయం సింగ్ యాదవ్ శనివారం జన్పూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలపై అణిచివేత, కులం ఆధారంగా వేధింపులు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారుతుంటే, రైతాంగానికి తమ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు.
తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని అన్నారు. యూపీలో ఎస్పీ అధికారంలోకి వస్తే వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యోగి హయాంలో కొన్ని చోట్ల హింస చెలరేగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అణిచివేత సాగుతోందని తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం చూడకుండా మనుషులందరినీ సమంగా చూస్తామని చెప్పారు.ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.