హైదరాబాద్, జూలై 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో అంతా ఊహించినట్టే జరిగింది. పీవోకే మీ వల్లే చేజారిపోయిందంటే, మీ వల్లేనంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకొన్నాయి. ఈ మేరకు లోక్‌సభలో మంగళవారం ‘ఆపరేషన్ సిందూర్’పై వాడీవేడిగా చర్చ కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పతాకస్థాయిలో ఉండగా కేంద్రంలోని మోదీ సర్కారు అనూహ్యంగా పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొన్నది. దీంతో పీవోకే తిరిగి చేజిక్కే సువర్ణావకాశం చేజారిపోయిందంటూ యావత్తు జాతిజనులు కేంద్రంపై మండిపడ్డారు. ఇదే విషయమై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి.
పీవోకేను దక్కించుకొనే అవకాశాన్ని చేజార్చారని విరుచుకుపడ్డాయి. దీనిపై ప్రధాని మోదీ మంగళవారం ఎట్టకేలకు స్పందించారు. విపక్ష కాంగ్రెస్ కారణంగానే పీవోకే చేజారిపోయిందంటూ ఎదురుదాడికి దిగారు. ‘పీవోకేను ఎందుకు తిరిగి వెనక్కితీసుకురాలేదని ప్రశ్నించే ముందు.. దాన్ని ఎవరు చేజార్చారన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్నీఇన్నీ కావు. 1971 భారత్-పాక్ యుద్ధంలో పాక్ మీద పై చేయి సాధించినప్పుడు.. పీవోకేను వెనక్కి తీసుకొనే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేజార్చింద’ని మోదీ దుయ్యబట్టారు. ఆపరేషన్ సిందూర్‌లో దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ మన జవాన్ల శౌర్యానికి మద్దతు పలుకలేదని ధ్వజమెత్తారు.
‘ఆపరేషన్ మహదేవ్’లో పహల్గాం ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు దేశం విజయోత్సవాలు చేసుకొంటున్నదని ప్రధాని అన్నారు. అయితే, ఆ విషయాన్ని వదిలిపెట్టి.. ఎన్కౌంటర్ టైమింగ్‌పై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని నిప్పులు చెరిగారు. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్‌ను నిలిపేసినట్టు చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపివేయాలని ఏ ప్రపంచ నేత కూడా తనకు చెప్పలేదన్నారు.