వాషింగ్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో మోదీ వైట్‌హౌజ్‌ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. దేశాధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో.. సోమవారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు.ఆ ఫోన్ సంభాషణ గురించి ట్రంప్ వెల్లడించారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్తున్న సమయంలో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడనని, ఆయన వైట్‌హౌజ్‌కు రానున్నారని, బహుశా ఫిబ్రవరిలో ఆయన శ్వేతసౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్నట్లు తెలిపారు. ఇండియాతో తమకు మంచి రిలేషన్ ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
మోదీతో ఫోన్లో అన్ని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. తొలి సారి దేశాధ్యక్షుడిగా చేసిన సమయంలో.. ట్రంప్ తన చివరి పర్యటన ఇండియాకే వచ్చారు. ఆ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నది. 2019లో హూస్టన్‌లో జరిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇద్దరూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.