(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా లోక్సభ సభ్యులతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని మోదీ హెచ్ఏఎల్ (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) పనితీరును ప్రశంసిస్తే, మరో వైపు కాగ్ తన నివేదికలో ఆ కంపెనీని తప్పుపట్టింది. జాప్యం, పని పట్ల నిబద్ధత లేకపోవడం వల్ల ఆ సంస్థ రూ.159 కోట్లు నష్టపోయినట్టు పేర్కొంది.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా గురువారం లోక్సభలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలను విమర్శిస్తూ, హెచ్ఏఎల్, ఎల్ఐసీ లాంటి సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయని, కానీ అవి లాభాల్లో నడుస్తున్నాయని అన్నారు. 2019లో రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలులో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డిఫెన్స్ డీల్లో రూ.30 వేల కోట్ల విలువైన ఆఫ్సెట్ కాంట్రాక్టు హెచ్ఏఎల్ కోల్పోయిందన్న ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని ఉటంకిస్తూ హెచ్ఏఎల్ దేశానికే గర్వకారణంగా మారిందని చెప్పారు. వాస్తవానికి, ప్రధాని వాదనకు విరుద్ధంగా కాగ్ తన నివేదికలో హెచ్ఏఎల్ ఆలస్యంగా ఉత్పత్తులు డెలివరీ చేయడం వల్ల మార్చి 2022 నాటికి రూ.159 కోట్లు నష్ట పోయిందని పేర్కొంది. ప్రాజెక్టు జాప్యం కావడం వల్లనే హెచ్ఏఎల్ నష్టం చవిచూడాల్సి వచ్చిందని వివరించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా హెచ్ఏఎల్ పనితీరును తీవ్ర స్థాయిలో విమర్శించింది. హెచ్ఏఎల్ను ప్రశంసిస్తూ మోదీ మాట్లాడిన రోజే కాగ్ తన నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టడం గమనార్హం.