Moody’s | న్యూఢిల్లీ, జూన్ 7: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నప్పటికీ, బీజేపీ బాగా బలహీనపడిందని ‘మూడీస్ అనలిటిక్స్’ పేర్కొన్నది. ఈ మేరకు శుక్రవారం ‘భారత ఎన్నికల సమీక్ష: సంకీర్ణ ప్రభుత్వంలోకి బీజేపీని చేర్చిన ఓటర్లు’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు పార్లమెంటులో లెక్కలు మార్చాయని, సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడం భాగస్వామ్య పక్షాలు ప్రభావాన్ని, పరపతిని పెంచుకుంటాయని పేర్కొన్నది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించేందుకు బీజేపీ ఇప్పుడు చర్చలు, రాజీ వంటి సాధనాలు వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతుందని అభిప్రాయపడింది. ఇది ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యానికి కారణం అవుతుందని, బీజేపీకి కీలకంగా ఉండే నిర్ణయాల నుంచి పక్కకు తప్పుకోవాల్సి రావొచ్చని పేర్కొన్నది.
ఈ దఫాలో రాజకీయ స్థిరత్వం తగ్గడం, సంకీర్ణ ప్రభుత్వంలో ఏకాభిప్రాయ సాధన అవసరం ఉండటం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని తగ్గిపోవచ్చని మూడీస్ అనలటిక్స్ అసోసియేట్ ఎకనమిస్ట్ అదితి రామణ్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం, సామాజిక – ఆర్థిక అసమానతలు, తదితర దీర్ఘకాల సవాళ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది మార్కెట్లు గమనిస్తాయని తెలిపారు.
సంకీర్ణ ప్రభుత్వం ఎంత ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తుందనే దానిపై రానున్న ఐదేండ్లలో భారత అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక పేర్కొన్నది. కీలక ఆర్థిక సవాళ్ల విషయంలో విధానాల రూపకల్పనలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయనేది ఈ బడ్జెట్ ద్వారా తెలియబోతున్నదని తెలిపింది. మౌలిక సదుపాయాలు అభివృద్ధి, సేవలు, తయారీ రంగంలో ప్రభుత్వం మూలధన వ్యయం ఎలా చేస్తుందనేది కూడా చూడాల్సి ఉందని పేర్కొన్నది.