Jamili Elections | న్యూఢిల్లీ: ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ విధానాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే అమలు చేసే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, జమిలి ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు భావిస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఏర్పాటైన ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. మిగిలిన పదవీ కాలం పూర్తయ్యే వరకు మిత్ర పక్షాల మద్దతు ఇదే విధంగా కొనసాగుతుందని బీజేపీ విశ్వాసంతో ఉన్నది.
ఓ మీడియా సంస్థ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఎన్డీయే పదవీ కాలంలోనే ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ సంస్కరణలను అమలు చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మోదీ ప్రసంగంలో కూడా దీనిని ప్రస్తావించారు. పదే పదే ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశ ప్రగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలకు దేశం ముందుకు రావాలన్నారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసింది. మొదట లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని కోవింద్ కమిటీ చెప్పింది.
వీటిలో చాలా సవరణలకు రాష్ర్టాల ఆమోదం అక్కర్లేదు. కేవలం పార్లమెంటు ఆమోదిస్తే సరిపోతుంది. లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్సభ, శాసనసభలు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ హౌస్ ఏర్పడినపుడు లేదా అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందినపుడు ఐక్యతా ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని చెప్పవచ్చు.