హైదరాబాద్, ఆగస్టు 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘గుజరాత్ మాడల్’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ పరివారమంతా చేస్తున్న ప్రచారమంతా మేడిపండు చందమేనా? దేశంలోనే సంపన్న రాష్ట్రమని, పరిశ్రమలకు గుజరాత్ అడ్డా అని ఇప్పటివరకూ ఊదరగొట్టిందంతా ఉత్తదేనా? ధనిక రాష్ట్రంగా కలరింగ్ ఇస్తున్న గుజరాత్లో ప్రజల ఆదాయం అంతంత మాత్రంగానే ఉందా? ఆదాయ పన్ను తాజా గణాంకాలను విశ్లేషిస్తే ఇదంతా నిజమేనని అర్థమవుతున్నది. ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయం ఆర్జిస్తూ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో గుజరాత్ అధఃపాతాళంలో నిలిచింది.
టాప్-10 జాబితాలో మోదీ స్వరాష్ట్రం ఎక్కడా కూడా కనిపించకపోవడం గమనార్హం. ఆదాయ పన్ను చెల్లింపులు.. ప్రజల ఆర్థికాభివృద్ధిని సూచిస్తాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంలో గుజరాత్.. టాప్-10లో కూడా లేకపోవడాన్ని విశ్లేషిస్తే, ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, ప్రజల ఆదాయం దుర్భర స్థితిలో ఉన్నట్టు అర్థమవుతున్నదని అభిప్రాయపడుతున్నారు. మోదీ ‘గుజరాత్ మాడల్’ డొల్ల అని తాజా నివేదిక కుండబద్దలు కొట్టిందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
రూ. 12 లక్షల-రూ. 50 లక్షల ట్యాక్స్ బ్రాకెట్లో పన్ను చెల్లిస్తున్న వారి జాబితాలో కర్ణాటక తొలి స్థానంలో నిలువగా, తెలంగాణ రెండో స్థానాన్ని కైవసం చేసుకొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగానే తెలంగాణ ప్రజల ఆదాయం పెరిగిందని, తద్వారా ట్యాక్స్ పేయర్స్ సంఖ్య కూడా ఎక్కువగా రికార్డయినట్టు నిపుణులు చెప్తున్నారు. కాగా వెనుకబడిన రాష్ర్టాలుగా చెప్పుకొనే జార్ఖండ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా, ఒడిశా ఏడో ర్యాంకులో, ఉత్తరాఖండ్ పదో స్థానాన్ని సాధించి గుజరాత్‌ను దాటిపోవడం గమనార్హం.