హైదరాబాద్, ఆగస్టు 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పెరుగుతున్న ధరలు, పన్నుల మోత, నిరుద్యోగం, దౌత్య వైఫల్యాలు, సరిహద్దుల్లో సమస్యలు వెరసి మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ కొత్తపాట అందుకొన్నారు. వరాలు, హామీలతో మళ్లీ అరచేతిలో స్వర్గాన్ని చూయించే ప్రయత్నం చేశారు. అయితే, మోదీ చేసిన ప్రకటనలపై నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ.. 11 ఏండ్ల బీజేపీ పాలనను గణాంకాలతో సహా ఎండగడుతున్నారు. అబద్ధపు మాటలను ఇకపై నమ్మబోమని ధ్వజమెత్తుతున్నారు.
ప్రధాని మోదీ: పేద, మధ్యతరగతిపై పన్నుల భారం తగ్గించడానికి జీఎస్టీలో పలు సంస్కరణలు తీసుకురాబోతున్నాం.
నెటిజన్ల కౌంటర్: పదకొండేండ్ల ఎన్డీయే సర్కారు పాలనలో సామాన్యుడి జీతంలోని సింహభాగమంతా పన్నులకే పోయింది. 2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 17.94 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తే, 2025నాటికి అది రూ. 50 లక్షల కోట్లు దాటింది. మొత్తంగా 11 ఏండ్లలో పన్నుల పేరిట రూ. 329 లక్షల కోట్లను మోదీ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. ఇక, 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. 2017-18లో రూ. 7.41 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 2024-25 నాటికి రూ. 22.08 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. ఇన్నిరోజులూ ప్రజల నుంచి పన్నులను పిండుకొన్న మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు తీరిగ్గా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించడం మోసం చేయడంగాక మరేమిటీ?
ప్రధాని మోదీ: యువత కోసం రూ.లక్ష కోట్లతో పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన తీసుకొస్తున్నాం. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు రూ.15 వేలు సాయం అందిస్తాం.
నెటిజన్ల కౌంటర్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇచ్చిన హామీని పక్కనబెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు 7 లక్షలు మాత్రమే . దేశంలో నిరుద్యోగిత రేటు 7.2 శాతంగా ఉన్నట్టు మేధో సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభించలేదని స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ ‘అన్‌స్టాప్’ తాజా నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు మోదీ రూ.లక్ష కోట్లతో స్కీమ్ అంటూ కొత్త కబుర్లు మొదలుపెట్టారు.
ప్రధాని మోదీ: యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం.
నెటిజన్ల కౌంటర్: మేకిన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడంతో పాటు ప్రైవేటురంగ కంపెనీలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా 11 ఏండ్ల మోదీ హయంలో దేశవ్యాప్తంగా 6.26 లక్షల కంపెనీలు మూతబడ్డాయి. 15 ప్రభుత్వరంగ సంస్థలు కనుమరుగయ్యాయి. 2024-25లోనే 35,567 కంపెనీలు మూతబడగా, గడిచిన రెండేండ్లలో 28 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిలిపేశాయి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు అందకపోవడమే దీనికి కారణం. మోదీ ప్రభుత్వహయాంలో 2014 నుంచి 2021 మధ్యలో 2,784 విదేశీ కంపెనీలు భారత్‌కు గుడ్‌బై చెప్పాయి. ఇప్పుడు కొత్తగా మీరిచ్చే ప్రోత్సాహకాలు ఏమిటో మరి??
ప్రధాని మోదీ: వికసిత్ భారత్ సాకారంలో ఆత్మ నిర్భర్ భారత్ కీలకమైనది. వస్తు-ఉత్పత్తులు, సేవలు, రక్షణ తదితర అంశాల్లో ఇతర దేశాలపై ఆధారపడకూడదు.
నెటిజన్ల కౌంటర్: స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి మేకిన్ ఇండియాకు ఊతం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే, దిగుమతులకు ప్రభుత్వమే తలుపులను బార్లా తెరిచింది. గడిచిన ఐదేండ్లలో ఆత్మనిర్భర్ లక్ష్యాలు అటకెక్కాయి.