మధుబని(బీహార్): పహల్గాం ఉగ్ర దాడి అనంతరం గురువారం మొట్టమొదటిసారి బహిరంగంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు. వారు కలలో కూడా ఊహించని కఠినమైన శిక్షలు అనుభవిస్తారని ప్రధాని హెచ్చరించారు. బీహార్‌లోని మధుబనిలో ఓ ర్యాలీని ఉద్దేశించిన ప్రసంగించిన మోదీ భారతదేశ స్ఫూర్తిపై దాడికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తి లేదన్న సందేశం యావత్ ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఇంగ్లిష్‌లోకి మాటా డారు.
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా ప్రధాని అభివర్ణించారు. ‘ఈ దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని, దీని వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి, వేటాడి, శిక్షిస్తామని బీహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి ఈరోజు నేను తెలియచేస్తున్నాను. ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని పట్టుకుంటాం. ఉగ్రవాదంతో భారతదేశ స్ఫూర్తిని ఎన్నటికీ దెబ్బతీయలేరు’ అని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా కఠినాతి కఠినమైన శిక్షలు ఉంటాయని మోదీ హెచ్చరించారు.