PM Modi : కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ (Mark Corney), ఆయన లిబరల్ పార్టీ (Liberal party) కి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Naredra Modi) శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా నాలుగోసారి అధికారం దక్కించుకున్న లిబరల్ పార్టీని అభినందించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) హయాంలో ఇరు దేశాల మధ్య క్షీణించిన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన మార్క్ కార్నీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
‘భారత్, కెనడా దేశాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయి. చట్టబద్ధమైన పాలన పట్ల దృఢమైన నిబద్ధత కలిగి ఉన్నాయి. ప్రజలకు, ప్రజలకు మధ్య శక్తిమంతమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. మీతో కలిసి ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, మన ప్రజల కోసం అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నా’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కాగా జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, కెనడా బంధాలు తీవ్రంగా క్షీణించాయి. ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాదులుకు, ఖలిస్తానీ మద్దతుదారులకు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య ఘర్షణ మొదలైంది. ప్రధాని హోదాలో ఉన్న ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
అయితే భారత్ వీటిని అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. ఉగ్రవాదులకు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారిందని భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పలుమార్లు కెనడా నుంచి భారత్ ఆధారాలను కోరినప్పటికీ, అప్పటి ట్రూడో ప్రభుత్వం ఎలాంటి సాక్ష్యాలను అందించలేదు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మార్క్ కార్నీ ప్రధాని అయ్యారు. తాజా ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రధాని పదవి చేపట్టబోతున్నారు.