PM Modi | రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ సెంయిట్ ఆండ్రూ ది అపోస్టల్’ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణతో పాటు బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారంతో గౌరవించినట్లు తెలిపారు. అయితే, రష్యా పురస్కారం ప్రకటించడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇక రష్యా పర్యటనలో మోదీ పుతిన్‌తో చర్చలు జరిపారు.
ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని మోదీ వెల్లడించారు. వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, టెక్నాలజీ, ఆవిష్కరణలు తదితర రంగాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపామని.. ప్రజల మధ్య నేరుగా సంబంధాల వృద్ధికి, అనుసంధానత పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా మాస్కోలోని ప్రఖ్యాత ఆటమ్ పెవిలియన్‌ను పుతిన్‌తో కలిసి సందర్శించినట్లు తెలిపారు. భారత్, రష్యా మధ్య సహకారానికి ఇంధన రంగం మూలస్తంభంలాంటిదని.. ఈ రంగంలో ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం చేసుకునేందుకు మరింత ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే శాంతి ముఖ్యమని, యుద్ధాల ద్వారా శాంతి లభించదని స్పష్టం చేశారు. యుద్ధాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభించవని.. బాంబులు, తుపాకీ మోతల మధ్య జరిగే చర్చలు ఫలించవన్నారు. చర్చల ద్వారా శాంతిస్థాపనకు ప్రయత్నించాలని సూచించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య గతకొంతకాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
#WATCH | Russian President Vladimir Putin confers Russia’s highest civilian honour, Order of St Andrew the Apostle on Prime Minister Narendra Modi. pic.twitter.com/aBBJ2QAINF
— ANI (@ANI) July 9, 2024