న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. అదానీపై ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న దర్యాప్తు కారణంగానే ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీచేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ బలంగా తిప్పికొట్టలేకపోతున్నారని, దీన్ని భారత ప్రజలు అర్థం చేసుకోవాలని ఎక్స్ వేదికగా రాహుల్ ఆరోపించారు.
మోదీ, ఏఏ(ఆంగ్ల అక్షరాలు) మధ్య ఆర్థిక బంధాలు, రష్యా చమురు లావాదేవీలను బట్టబయలు చేసే హెచ్చరిక అందులో ఒకటి అని రాహుల్ ఆరోపించారు. మోదీ చేతులు కట్టేసి ఉన్నాయి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏఏ అంటే అర్థమేమిటో రాహుల్ వివరించనప్పటికీ ప్రపంచ కుబేరులు అదానీ, అంబానీలతో మోదీ సంబంధాలపై గతంలో ఆయన అనేకసార్లు ఆరోపణలు చేసిన దృష్ట్యా ఆ ఏఏ ఎవరో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
అదానీ పోర్టులు, స్పెషల్ ఎకనమిక్ జోన్కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న గౌతమ్ అదానీ పదవుల నుంచి తప్పుకోవడం రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై సాగుతున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. గత ఏడాది నవంబర్లో అదానీతోపాటు ఆయన సోదరుని కుమారుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సాగర్ అదానీలతో సహా ఏడుగురిపై అమెరికా కోర్టుల్లో అభియోగాలు నమోదయ్యాయి.