ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ మణిపూర్ ఉద్రిక్తతలను చూడలేరని, ఆయన కేవలం అధికారాన్ని మాత్రమే చూడగలరని గొగోయ్ ఎద్దేవా చేశారు.
మణిపూర్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన ‘ఇండియా’ ఎంపీల ప్రతినిధి బృందంలో గౌరవ్ గొగోయ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంఫాల్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మణిపూర్ విషయంలో వారి వైఖరిని బట్టి బీజేపీ-ఆరెస్సెస్‌ల జాతీయవాదం ఫేక్ అని తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితి నియంత్రణ రేఖ దగ్గర పరిస్థితులను తలపిస్తున్నదని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. నియంత్రణ రేఖ దగ్గర రెండు దేశాల సైనికులు ఏకే-47 లాంటి ఆయుధాలు పట్టుకుని గస్తీ కాస్తుంటారని, ఇప్పుడు మణిపూర్‌లో కూడా రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఆయుధాలు చేతబట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండటం బాధాకరమని అన్నారు.