Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇది మనం కలగంటున్న వికసిత్ భారత్ 2047కు సరైన దిశను చూపే బడ్జెట్ అని మోదీ అన్నారు.
భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బడ్జెట్ చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. తాజా బడ్జెట్‌పై ప్రధాని ఒక వీడియో ప్రకటన చేశారు. ఈ వీడియోలో బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ బడ్జెట్ దేశంలోని మహిళా శక్తికి, సాధికారతకు ప్రతిబింబం. మహిళా మంత్రిగా నిర్మాలా సీతారామన్ తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే భారత ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది. 140కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఇండియా ఉండాలని దేశ ప్రజలు కోరుకోవడం లేదు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని ప్రజలు భావిస్తున్నారు. వికసిత భారత్ 2047కు మార్గనిర్దేశనం చేస్తుంది. కొత్త అవకాశాలకు రహదారిలాంటిది ఈ బడ్జెట్. ప్రజల ఆకాంక్షలు కార్యరూపం దాల్చి, భారత భవిష్యత్‌ను బలోపేతం చేస్తుంది. మూలధన వ్యవయానికి, వృద్ధికి సమతుల్యత పాటించిన బడ్జెట్ ఇది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.