న్యూఢిల్లీ, అక్టోబర్ 10: మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోదీ తీరు ప్రతిపక్ష నాయకులకే కాదు, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులకు సైతం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో హింస నేపథ్యంలో మణిపూర్ అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో పరిస్థితి తెలిపేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలుసుకోవాలని సెప్టెంబర్ 30న ప్రయత్నించారు. దీనిపై మీడియా వర్గాలు ఆరా తీయగా, ప్రధాని నుంచి అపాయింట్మెంట్ లభించలేదని బీజేపీ ఆఫీస్ బేరర్లు తెలిపారు. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలంతా న్యూఢిల్లీలో ఉన్నారని, తమను కలుసుకునేందుకు ప్రధాని మోదీని ఒప్పించాలని రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి జేపీ నడ్డాను వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. ఇదిలా ఉండగా, మణిపూర్లో ఆర్టికల్ 355 అమల్లో ఉందా? లేదా? అన్నది అర్థం కావటం లేదని, దీనిపై స్పష్టత ఇవ్వాలని జేపీ నడ్డాకు రాసిన లేఖలో మణిపూర్ బీజేపీ కోరింది.