న్యూఢిల్లీ: యువ శక్తితో అభివృద్ధి చెందిన దేశం కావాలన్న కల సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న 25 ఏండ్లలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతదే కీలక భూమిక అవుతుందని ఆయన స్పష్టం చేశారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ వివేకానంద నమ్మినట్లుగానే తాను కూడా యువతను సంపూర్ణంగా నమ్ముతానని చెప్పారు. ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సులో ప్రపంచ భవిష్యత్తు గురించి ప్రపంచ నాయకులు ఇక్కడ చర్చించారని, ఇప్పుడు ఇదే వేదిక నుంచి దేశ యువత రానున్న 25 ఏండ్లకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని మోదీ తెలిపారు.