జమ్మూ కశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూల మూలల్లోకి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
జమ్మూ కశ్మీర్ ప్రజలు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు దూరమయ్యారని, అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఉన్న అంతరాలను చెరిపేసి, అందర్నీ ఏకం చేయాలన్న లక్ష్యంతోనే ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అన్న నినాదాన్ని తీసుకొచ్చామని అన్నారు. జమ్మూ కశ్మీర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమని మోదీ చెప్పుకొచ్చారు.
జమ్మూ కశ్మీర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జమ్మూ కశ్మీర్ చరిత్రలో అభివృద్ధి పనుల ద్వారా ఓ నూతన శకం ప్రారంభమైనట్లేనని మోదీ వ్యాఖ్యానించారు. అటు ప్రజాస్వామ్యంలో గానీ, అభివృద్ధిలో గానీ.. జమ్మూ కశ్మీర్ ఓ కొత్త ఉదాహరణగా ప్రజల ముందు నిలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా అభివృద్ది కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు.
రాబోయే రోజుల్లో జమ్మూ కశ్మీర్ కొత్త చరిత్రను లిఖించబోతోందని మోదీ హామీ ఇచ్చారు. తమ తాతలు, తండ్రులు ఎన్ని ఇబ్బందులు పడుతూ… జీవించారో.. ప్రస్తుత తరానికి అన్ని ఇబ్బందులు లేకుండా చూస్తామని, యువతకు మంచి భవిష్యత్తు అందేలా చర్యలు చేపడతామని మోదీ హామీ ఇచ్చారు. ఇన్ని ఏళ్లలో జమ్మూ కశ్మీర్‌కు కేవలం 17 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, కానీ.. రెండేళ్లలో అవి 38 వేల కోట్లకు ఎగబాకిందని మోదీ పేర్కొన్నారు.