PM Modi | న్యూఢిల్లీ : సీజేఐ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరవడం వివాదాస్పదమైంది. సీజేఐ పక్షపాత వైఖరిని విపక్షాలు ప్రశ్నించాయి. సీజేఐ ఇంట్లో జరిగిన పూజకు ప్రధాని మోదీ హాజరవ్వడం న్యాయవ్యవస్థ నిష్పాక్షపాతంపై ప్రజల్లో సందేహాలు ఏర్పడే అవకాశాలున్నాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కాగా, తనదే అసలైన శివసేన అంటూ ఏక్నాథ్ షిండే ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన కేసు విచారణ నుంచి సీజేఐ దూరంగా ఉంటే మంచిదని ఆయన సూచించారు.
ఎందుకంటే ఈ కేసులో ప్రధాని మోదీ మరో పార్టీగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు ఒక పార్టీతో సీజేఐ సన్నిహితంగా ఉన్న విషయం బహిరంగంగా అందరికీ తెలిసిందని, అలాంటి పరిస్థితులలో సీజేఐ తమకు న్యాయం చేయగలరా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. బద్లాపూర్ లైంగికదాడి కేసులో ఏ మాత్రం స్పందించని సుప్రీంకోర్టు .. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసును మాత్రం సుమోటోగా తీసుకోవడాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా విపక్షాలకు వ్యతిరేకంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదే అంశంపై ఇతర ఎంపీలు మిలింద్ దేవర, ప్రియాంక చతుర్వేది కూడా ఘాటుగా విమర్శలు చేశారు. ఆ కార్యక్రమం కేవలం గణపతి పూజకే పరిమితమైందని, దీనిని శివసేన (యూబీటీ) అనవసరంగా రాజకీయం చేస్తున్నదని బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోశ్ విమర్శించారు.