న్యూఢిల్లీ, మార్చి 8: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని ఆయన పేర్కొన్నారు. ‘సిలిండర్ ధర తగ్గింపుతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ముఖ్యంగా ‘నారీశక్తి’కి ప్రయోజనం చేకూరుస్తుంది’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. వంట గ్యాస్ ధర తగ్గింపు నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.
తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803 ఉంటుందని పేర్కొన్నారు. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు రూ.300 రాయితీతో ఇప్పుడు సిలిండర్‌ను కేవలం రూ.503కే పొందుతారని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రాష్ర్టాల్లో స్థానిక పన్నుల ఆధారంగా సిలిండర్ ధరలో మార్పు ఉంటుంది. అయితే సిలిండర్ ధరను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గిస్తూ మరోసారి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఆరు నెలల్లో వంట గ్యాస్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. గత ఏడాది ఆగస్టులో సరిగ్గా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.200 తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటికే ఎల్పీజీ సిలిండర్ ధరలు తొమ్మిదేండ్ల గరిష్ఠానికి చేరాయి. ఆ సమయంలో చేపట్టిన సవరణతో సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కి తగ్గింది. కాగా, లోక్‌సభ ఎన్నికల భయంతోనే సిలిండర్ ధరను కేంద్రం తగ్గించిందని, ఇదొక చౌకబారు పొలిటికల్ స్టంట్ అని టీఎంసీ విమర్శించింది. మోదీ చేసే నారీశక్తి ప్రచారం కేవలం ఎన్నికల వరకే పరిమితం అవుతుందని ఎంపీ సాగరిక ఘోష్ అన్నారు.