PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కాల్పుల విరమణపై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్న వార్త ప్రతీఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. ఒకవైపు పౌరులను కాపాడుకొంటూనే మరోవైపు పాక్ రేంజర్లకు భారత సైన్యం చుక్కలు చూపిస్తుంటే.. ఢిల్లీలోని ఎన్డీయే సర్కారు మాత్రం కాల్పుల విరమణ నిర్ణయం తీసుకొన్నది. వాణిజ్యం నిలిపేస్తానని బెదిరించడంతోనే మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు, మోదీ ఆప్తమిత్రుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దీన్నిబట్టి, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌ను అమెరికా సహా సభ్య దేశాల ముందు దోషిగా నిలబెట్టడంలో ప్రధాని మోదీ దౌత్యం విఫలమయ్యిందా? అని రక్షణ రంగ, దౌత్యసంబంధిత నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
మోదీ ఆప్తమిత్రుడు ట్రంప్ ఇలా..
భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా తొలి నుంచీ భిన్న వైఖరిని అవలంబించింది. శుక్రవారం ఈ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరు దేశాల సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోబోమని తెగేసి చెప్పారు. భారత్-పాక్ యుద్ధంలో తలదూర్చబోమన్న ఆయన అది తమ పని కాదని మాట్లాడారు. అంతేకాకుండా ఈ ఉద్రిక్తతలతో తమ దేశానికి ఏ మాత్రం సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు. ఆ మరుసటి రోజే.. అమెరికా నుంచి దీనికి భిన్నమైన ప్రకటన వచ్చింది. భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు వాణిజ్యం ఆపేస్తానంటేనే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ స్వయంగా చెప్పారు. ట్రంప్‌ను తన ఆప్త మిత్రుడిగా చెప్పుకొనే మోదీ.. పాక్‌కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తుంటే ఆయన్ని ఎందుకు నిలదీయట్లేదు? విరమణకు సంబంధించిన ప్రకటన చేస్తూ.. పాక్‌ను, భారత్‌ను ట్రంప్ ఒకేగాటన కట్టడంతో పాటు ఇరుదేశాలను ఉద్దేశించి ‘కామన్సెన్స్’ అనే వ్యాఖ్యలను ట్రంప్ చేశారు. దౌత్యపరిభాషలో ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమని నిపుణులు నిలదీశారు. అయినప్పటికీ, సోమవారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అమెరికా వైఖరిని ప్రశ్నించలేదు. ఇవన్నీ విశ్లేషిస్తే, పాక్‌ను దోషిగా నిలబెట్టే విషయంలో అమెరికా సాయాన్ని తీసుకోవడంలో మోదీ దౌత్యం ఏమీ పనిచేయలదేని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆర్థిక మూలాల విషయంలోనూ..
ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీపై గంపెడాశలు పెట్టుకొన్నది. ఘర్షణల నేపథ్యంలో పాక్‌కు ఆ ప్యాకేజీ దక్కకుండా చేసి ఉంటే ఆ దేశానికి గట్టిగా దెబ్బ కొట్టినట్లే అయ్యేది. అయితే, దాన్ని అడ్డుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రపంచానికే తాను విశ్వగురువుగా చెప్పుకొనే ప్రధాని మోదీ.. కేవలం 26 సభ్య దేశాలు ఉన్న ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, పాక్‌కు రుణం ఇచ్చే సమయం దగ్గరపడుతున్న కీలక సమయంలోనే ఐఎంఎఫ్‌లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ను మోదీ సర్కారు తొలగించడం సంచలనంగా మారింది. గడిచిన 80 ఏండ్లలో ఇలాంటి ఆకస్మిక తొలగింపు ఎన్నడూ జరుగలేదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రూ. 7.5 కోట్ల ఓ పుస్తక ప్రచురణకు సంబంధించి సుబ్రహ్మణియన్‌ను తొలగించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ, ఇలాంటి కీలక సమయంలోనే ఈ నిర్ణయం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక, భారత్‌కు మిత్ర దేశాలుగా చెప్పుకొనే అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా, యూఏఈ, రష్యా, అర్జెంటీనా ఇలా భారత్‌తో కలిసి 26 దేశాలు సభ్యులుగా ఉన్న ఐఎంఎఫ్‌లో పాక్‌కు రుణమిచ్చే విషయంలో ఏ ఒక్క దేశమూ భారత్‌కు మద్దతు ప్రకటించలేదని వార్తలు వస్తున్నాయి. ఇది దౌత్యపరంగా ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద వైఫల్యమని విశ్లేషకులు చెప్తున్నారు. పాక్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో మోదీ విదేశీ దౌత్యం విఫలమయ్యిందని ఎన్‌హెచ్ సింగ్ పేరిట ఓ యూజర్ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఐఎంఎఫ్ నుంచి పాక్‌కు రుణం అందకుండా సభ్య దేశాలను ఒప్పించడం కూడా మోదీ ప్రభుత్వానికి చేతకాలేదని ధ్వజమెత్తాడు. ఇది ముమ్మాటికీ మోదీ ప్రభుత్వ విదేశీ దౌత్య వైఫల్యమేనని మండిపడ్డాడు. మొత్తంగా పహల్గాం ఉగ్రదాడి విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు.
మరో మిత్ర దేశం తీరు అలా..
యూఏఈ-భారత్‌కు మధ్య దశాబ్దాలుగా మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. అయితే, పహల్గాం దాడులు జరిగిన సమయంలోనే యూఏ ఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయాద్ పాకిస్థాన్‌లో పర్యటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాదు, ఇరు దేశాలు ఉద్రిక్తతలకు పాల్పడకుండా శాంతి చర్చలు చేపట్టాలని యూఏఈ మొక్కుబడిగా ప్రకటించడం, కాల్పుల విరమణ ప్రకటన చేయడానికి అమెరికాతో యూఏ ఈ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాదు.. యూఏఈ దౌత్యం అద్భుతమంటూ పాక్ బహిరంగంగానే ప్రశంసించింది. భారత్‌కు మిత్ర దేశంగా ఉన్న యూఏఈ.. ఇలా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే మోదీ సర్కారు ఏం చేస్తున్నదన్న వాదనలు పలువురు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇక, భారత్-పాక్ ఉద్రిక్తతలపై రెండు మూడురోజుల కిందట చైనా స్పందిస్తూ.. తాము ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయితే, కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన వెంటనే చైనా మాట మార్చింది. పాకిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ప్రకటించింది. పాక్‌కు అన్ని విషయాల్లో అండగా ఉంటామని వెల్లడించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకమన్న చైనా.. అదే ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌కు సపోర్ట్ చేయడమేంటి? దీన్ని మోదీ ప్రభు త్వం దౌత్యపరంగా ఎందుకు అడ్డుకోలేకపోయింది? అనే సందేహాలను దౌత్యవేత్తలు లేవదీస్తున్నారు.
అతిపెద్ద దౌత్య వైఫల్యం
మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికాకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారు. భారత్-పాక్ మధ్య మూడో వ్యక్తి రావడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది మోదీ ప్రభుత్వ అతి పెద్ద దౌత్య వైఫల్యం. ఈ చర్యతో ప్రపంచంలో భారత్‌కు ఉన్న ప్రతిష్ఠ మసకబారుతున్నది. ఈ దౌత్య వైఫల్యం సంవత్సరాల తరబడి భారత్‌ను వెంటాడుతూనే ఉంటుంది.
– తన్మయ్ ఘోష్, రాజకీయ విశ్లేషకుడు
అవమానకరం
ట్రంప్ ఒత్తిడితో మోదీ ‘కాల్పుల విరమణ’పై రాజీపడటం ఇబ్బందికరమే కాదు అవమానకరం కూడా. ఇది దేశంలోని కోట్లాది మంది భారతీయులను ఆశ్చర్యానికి గురి చేసింది. దౌత్యపరంగా ఇది ఎన్డీయే ప్రభుత్వానికి ఓటమిగా చెప్పొచ్చు.
– సుశాంత్ సింగ్, రక్షణ రంగ నిపుణుడు