హైదరాబాద్, నవంబర్ 8 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణను అందించడమే లక్ష్యంగా 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) పథకం అక్రమాలకు అడ్డాగా మారింది. ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయకుండానే, అభ్యర్థులకు శిక్షణ ఇవ్వకుండానే నకిలీ పత్రాలను సృష్టించి రూ. కోట్ల ప్రజాధనాన్ని అక్రమార్కులు లూటీ చేశారు. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో వెల్లడించింది.
బీజేపీపాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనే ఎక్కువగా ఈ అక్రమాలు చోటుచేసుకొన్నట్టు సమాచారం. దీంతో అక్రమాలకు పాల్పడిన యూపీలోని 59 సెంటర్లను, ఢిల్లీలో 25, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 20 సెంటర్లను కేంద్రప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. సంబంధిత నకిలీ సెంటర్ల బాధ్యులపై కేసులు నమోదు చేసింది. 2024-25 బడ్జెట్లో పీఎంకేవీవై పథకానికి రూ.1,538 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఈ లెక్కన తాజాగా బయటపడిన ఆక్రమాల వల్ల రూ. వందల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.