PMKVY | న్యూఢిల్లీ, ఆగస్టు 5: కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మరో పథకం ఘోరంగా విఫలమైంది. నిరుద్యోగ యువతకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ప్రభుత్వం చేసిన వాగ్దానం నీటిమూటగా మారిపోయింది. నిరుద్యోగ యువజనులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) అట్టర్‌ఫ్లాప్ అయింది. పథకం కింద 2015 నుంచి 1.6 కోట్ల మందికిపైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వారిలో కేవలం 24.3 లక్షల మందికి మందికి మాత్రమే ఉద్యోగ కల్పన జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు తేల్చిచెప్పాయి. శిక్షణ పొందిన మొత్తం అభ్యర్థులలో కేవలం 15 శాతం లోపు అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాల కల్పన జరిగినట్లు ప్రభుత్వ లెక్కలు వివరిస్తున్నాయి.
ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్లేస్‌మెంట్స్ పొందేందుకు అవసరమైన శిక్షణతోపాటు స్వయం ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు కంపెనీలలో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు ప్లేస్‌మెంట్స్ నిర్వహించడం, రోజ్‌గార్ మేళాలు, జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళాలు వంటివి ఎన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. 2015, 2022 మధ్య స్వల్పకాలిక శిక్షణ(ఎస్ఐటీ) పొంది సర్టిఫికెట్లు పొందిన 56.89 లక్షల మంది అభ్యర్థులలో కేవలం 24.3 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. ఈ విభాగంలో మొత్తం అభ్యర్థులలో కేవలం 43 శాతం మందికి మాత్రమే అవకాశాలు లభించాయి.